ఢిల్లీ, 18 జూలై (హి.స.)ఈ నెల 19న ప్రతిపక్ష ఇండియా కూటమి (India alliance) నాయకుల సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సహా ఇతర నాయకులతో మాట్లాడినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వర్షాకాల సమావేశాలు, బిహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ సహా పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీకి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు హాజరయ్యే అవకాశం లేదు. టీఎంసీ జూలై 21న షహీద్ దివస్ జరుపుకుంటోంది, కాబట్టి ఆ పార్టీ నాయకులు బిజీగా ఉన్నారని, పార్టీ విస్తరణలో ఆప్ బిజిగా ఉన్నారని తెలుస్తోంది.
కాగా, లోక్ సభ ఎన్నికల అనంతరం ఇండియా అలయెన్స్ సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇండియా బ్లాక్ ఏర్పడిందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తాజా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి