అమరావతి, 23 జూలై (హి.స.)
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గొలుసుకట్టు తరహాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బహుమతులు, నగదు నజరానా పేరుతో ఆరా సంస్థ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడింది. మదనపల్లెలో సుమారు 6వేల మంది నుంచి వసూళ్లు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.2,000, రూ.5,400, రూ.20,000 కడితే రోజువారి ఆదాయం వస్తుందని నిర్వాహకులు నమ్మించి మోసం చేశారు.
మదనపల్లెకు చెందిన మోహన్‌బాబు అనే వ్యక్తి స్పిన్ గిఫ్ట్ ద్వారా లాప్‌ట్యాప్‌లు, ఫోన్లు, కార్లు, టూవీలర్లు ఇస్తామని నమ్మించి డబ్బు కట్టించుకున్నాడు. కొంతమందికి గిఫ్ట్‌లు ఇచ్చిన తర్వాత మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నట్లు సమాచారం. నమ్మి మోసపోయామని వారంతా లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ