హైదరాబాద్, 23 జూలై (హి.స.)
హెచ్సీఏ(HCA) అవకతవకల కేసు
నిందితుడు, సెక్రటరీ దేవరాజ్ రామచందర్ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజాము నుంచే నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీతో పాటు ఆయన నివాసం, ఆఫీసుల్లో దాడులకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసినప్పటి నుంచి దేవరాజ్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దేవరాజ్ పారిపోవడానికి పలువురు సహరించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. మరోవైపు దేవరాజ్పై లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ అయ్యింది. దేశం విడిచి పారిపోకుండా ఎయిర్ పోర్టులు, సీ పోర్టులను సీఐడీ(CID) అప్రమత్తం చేసింది. దేవరాజ్ కోసం రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నది. హెచ్సీఏ అధ్యక్షుడి ఎన్నిక సహా నిధుల దుర్వినియోగం కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావు ప్రధాన నిందితుడు కాగా.. దేవరాజ్ రామచందర్ రెండో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే జగన్ మోహన్ రావు సహా పలువురు అరెస్ట్ కాగా, దేవరాజ్ తప్పించుకొని తిరుగుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు సహా హెచ్సీఏలో అనుమానితులపై సీఐడీ నిఘా పెట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్