హైదరాబాద్, 23 జూలై (హి.స.)
తూర్పు, పశ్చిమ ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి పంజాగుట్ట వరకు ఫ్లైఓవర్ల మీదుగా ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. వర్షం కారణంగా పలుచోట్ల నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ట్రాఫిక్లో అంబులెన్సులు చిక్కుకుపోయాయి. దాంతో ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్ నుంచి జూబ్లీ చెకోపోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ అయింది. వర్షానికి రోడ్లపై వచ్చిన వరద నీరుతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. పది కిలోమీటర్ల రూట్లో ప్రయాణంకు రెండు గంటలకు పైగా పడుతోందని వాహనదారులు అంటున్నారు. ఓవైపు వర్షం, మరోవైపు భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్