తెలంగాణ, నిర్మల్. 23 జూలై (హి.స.)
ఇటీవల నిర్మల్ జిల్లా కుబీర్ మండలం
చాత గ్రామంలో చోటు చేసుకున్న వృద్ధుడి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూలై 17 అర్ధరాత్రి బలరాం గౌడ్ అనే వృద్ధుడు రక్తపుమడుగులో మరణించి ఉన్న ఘటనపై బుధవారం ఏఎస్పీ అవినాష్ కుమార్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.
వృద్ధుని కుటుంబ సభ్యులు, బంధువుల శుభకార్యానికి వేములవాడ వెళ్లగా, బలరాం గౌడ్ ఇంటివద్దే ఉండిపోయారు. ఇదే సమయంలో, అదే గ్రామానికి చెందిన కూలీ కార్మికుడు సిల్మల సంతోష్ (45) డబ్బుల కోసం వృద్దుడి ఇంట్లోకి చొరబడి, కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షలు తీసుకుని పరారయ్యాడు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో పోలీసులు చురుకైన దర్యాప్తు చేపట్టారు. క్లూ టీమ్, సెల్ సిగ్నల్, ఫింగర్ ప్రింట్, సీసీఎస్ సాంకేతిక సహకారంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
నిందితుడి వద్ద హత్యకు ఉపయోగించిన చిన్న కత్తి, పెద్ద కత్తి, గొడ్డలి, మొబైల్ ఫోన్ లభ్యమయ్యాయి. అలాగే మృతుని నుండి దొంగిలించిన రూ.1.5 లక్షల నగదు కూడా పోలీసులు రికవరీ చేశారు. గతంలోనూ 2008లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడిపై కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు