అమరావతి, 23 జూలై (హి.స.)
శ్రీశైలం ఆలయం: కర్నూలు జిల్లా శ్రీశైలంలో బుధవారం ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు వైభవంగా స్వర్ణ రథోత్సవం జరిగింది. వేకువజామున శ్రీమల్లికార్జున స్వామికి అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్ణ రథంపై కొలువైన స్వామిఅమ్మ వార్లకు శాస్త్రోక్తంగా పూజలు చేసి అర్చకులు మంగళహారతులు సమర్పించారు. భక్తుల శివ నామస్మరణలు, కళాకారుల నృత్య సందడి నడుమ ఆలయ మాడ వీధుల్లో స్వామిఅమ్మ వార్లకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ