హైదరాబాద్, 24 జూలై (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం అమలు
చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 'మహాలక్ష్మి' సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు” ఎగతాళి చేసినా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించి ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచి ఆనందకర జీవితానికి ఆలంబన అయ్యిందన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా నేటికి 200 కోట్ల మంది ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇది ఈ పథకం అమలులో మరో మైలురాయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ పథకం సక్సెస్ కు కారణమైన వారిని అభినందిస్తూ గురువారం మరోసారి ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి స్పందించారు:
ఈ ఒక్క పథకం వల్ల ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ 35 నుండి 60 శాతానికి పెరిగిందని... పేద ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చే సంఖ్య 31 శాతం పెరిగిందని సీఎం తెలిపారు. ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి ఇక ఆర్టీసీ కథ కంచికే అన్న పరిస్థితి ఉందని పేదవాడి ప్రగతి రథ చక్రం ఇక చరిత్ర పుటల్లోకి జారి పోతుందనే పరిస్థితి నెలకొని ఉందన్నారు. అటువంటి పరిస్థితుల నుంచి మొదలైన ప్రయాణం నేడు 200 కోట్ల జీరో టికెట్లతో ఆడబిడ్డలకు సహాయం చేసే స్థాయికి ఎదిగిందన్నారు. ఆర్టీసీ సంస్థ గట్టెక్కిందని అదే ఆర్టీసీలో పని చేస్తున్న చెల్లెమ్మలు స్వయంగా చెప్పడం నాకు ఎనలేని సంతోషాన్ని ఇస్తున్నాయన్నారు. ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి, సిబ్బంది, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ యాజమాన్యానికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్