కూకట్‌పల్లి, హైదరాబాద్ 26 జూలై (హి.స.)
, : జవాబుపత్రాలు దిద్దడంలో ఓ ప్రొఫెసర్ చేసిన పొరపాటుతో మూడు కళాశాలలకు చెందిన 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఓ విద్యార్థి ద్వారా తప్పిదాన్ని గుర్తించిన అధికారులు సరిచేసి ఫలితాలను ప్రకటించారు. జేఎన్‌టీయూ నాలుగో ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలు గత నెలలో జరిగాయి. ఫలితాలు ఈ నెల 17న ప్రకటించారు. చివరి ఏడాదిలో క్రెడిట్ బేస్డ్ సబ్జెక్టు ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్(ఈఐఏ) ఉంటుంది. ఈ సబ్జెక్టులో శ్రీదత్త, మల్లారెడ్డి, షాదన్ కళాశాలలకు చెందిన విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. శ్రీదత్త కళాశాల విద్యార్థి జేఎన్‌టీయూ పరీక్షల విభాగం అధికారులకు మెయిల్ చేసి.. ఈఐఏ సబ్జెక్టులో ఎక్కువ మంది ఫెయిల్ కావడానికి అవకాశంలేదని మరోసారి ఫలితాలను చెక్ చేయాలని కోరాడు. అప్రమత్తమైన అధికారులు 138 మంది ఫెయిల్ అయ్యారని గుర్తించి.. వారి జవాబు పత్రాలను పరిశీలించగా దిద్దిన ప్రొఫెసర్ పొరపాటు చేసినట్లు తేల్చారు. పరీక్ష ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌లో వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించారు. ప్రొఫెసర్ ఉదయం ప్రశ్నపత్రంతోనే సాయంత్రం జవాబు పత్రాలను కూడా దిద్దినట్లు గుర్తించారు. వెంటనే సాయంత్రం ప్రశ్నపత్రంతో దిద్దించగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. గురువారం రాత్రి ఫలితాలను సరిచేసి ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ