అమరావతి, 26 జూలై (హి.స.)
అనకాపల్లిలో ఎన్నో ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న చెర్లోపల్లి ఖండంలోని రైతుల లేఅవుట్ సమస్యను పరిష్కరించిన సీఎం చంద్రబాబునాయుడుకు మాజీ మంత్రి దాడివీరభద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్‌ను ఆనుకుని ఉన్న విలువైన చెర్లోపల్లి భూములను నాటి వుడా అధికారులు లేఅవుట్ నిర్మాణాలకు సేకరించారన్నారు. 2023లో కలెక్టర్ మల్లికార్జునరావు రైతులతో మాట్లాడి దీనివల్ల వీఎంఆర్‌డీఏకు (వుడాకు) రూ. 53 కోట్ల వరకు లాభం వస్తుందని అంచనా వేశారన్నారు. నివేదికను అప్పటి పురపాలక కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రీలక్ష్మికి నివేదికను పంపగా ఆమె జాప్యం చేశారని వీరభద్రరావు ఆరోపించారు. ఇలా ఈ లేఅవుట్‌కి సంబంధించి ఐఏఎస్ అధికారులు చూపిన నిర్లక్ష్యం ఇన్నేళ్లు రైతులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి రైతులకు ఏళ్ల తరబడి అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఇంత కాలానికి సీఎం చంద్రబాబు తగిన చొరవ చూపి రైతులకు న్యాయం చేసేలా మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేయడంపై వ్యవసాయదారుల సంఘం తరఫున వీరభద్రావు కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ