హైదరాబాద్, 24 జూలై (హి.స.)
సీపీఐ నారాయణ తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు, టాలీవుడ్ సినిమా కంటెంట్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు ఉదయం ఆయన ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. తాను ఆర్ నారాయణ మూర్తి తో కలిసి లీకేజీలతో విద్యార్థులు, నిరుద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడతారనే దానిపై సందేశాత్మక సినిమా తీశారని, అలాంటి మంచి సినిమాకు ప్రభుత్వాలు రాయితీ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సీఎంలు అయిన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి.. నారాయణ మూర్తిని చూసి సిగ్గు తెచ్చుకొవాలని కీలక వ్యాఖ్యలు చేశారు.
సందేశాత్మక సినిమాలకు సహాయం చేయకుండా.. ఎర్రచందనం అమ్ముకోండి, బ్లాక్ మనీ చేసుకోండి, మర్డర్లు చేయండని చూపించే చెడు సందేశాత్మక చిత్రాలకు రాయితీ ఇచ్చి సహాయం చేయడాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. జనం కోసం ఉపయోగపడే సినిమా తీసిన నారాయణముర్తికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఈ సందర్భంగా నారాయణ డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్