తెలంగాణ, 24 జూలై (హి.స.)
ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ దుకాణదారులను హెచ్చరించారు. గురువారం కట్టంగూర్ మండల కేంద్రంలోని అధీకృత ఎరువుల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రసీదు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి పీఓఎస్ మిషన్ ఆన్లైన్ వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఆర్పీ ధరలకే ఎరువులు విక్రయిండంతో పాటు పీఓఎస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయాలను చేపట్టాలని సూచించారు.
ఎరువులు కొనుగోలు చేసిన సమయంలో రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలన్నారు. ప్రతి దుకాణంలో స్టాక్ వివరాలు, ధరల పట్టికను బోర్డులో పొందుపర్చాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వ్యవసాయ అధికారులు, దుకాణదారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం సబ్సిడీపై నాణ్యమైన ఎరువులను అందిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు