అమరావతి, 24 జూలై (హి.స.)
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డును(ఓఆర్‌ఆర్) 140 మీటర్లుకు విస్తరించి, గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా పట్టాలెక్కించడానికి జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్) శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన తొలి అడుగు... ఆర్థిక ప్రతిపాదనల(ఫైనాన్షియల్ ప్రపోజల్స్) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే చేస్తోంది.
70 నుంచి 140 మీటర్లకు...
అమరావతి డివిజన్ ఎన్‌హెచ్ అధికారులు గతంలో 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్‌ఆర్ నిర్మాణానికి ఆర్థిక ప్రతిపాదనలను రూపొందించారు. వాటిలో ప్రధానంగా భూ సేకరణ, నిర్మాణ వ్యయం అంతర్భాగంగా ఉంటాయి. ప్రాజెక్టుకు మొత్తంగా రూ.16,200 కోట్లు ఖర్చవుతుందనీ, అందులో భూ సేకరణకు రూ.2,600 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. తాజాగా ఓఆర్‌ఆర్ వెడల్పును 140 మీటర్లకు విస్తరించడానికి కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో తిరిగి ఆర్థిక ప్రతిపాదనలను రూపొందించాల్సి వచ్చింది. రెట్టింపు భూ సేకరణ చేయాల్సి ఉండటంతో అందుకు గతంలో కేటాయించిన దానికంటే రెట్టింపు... అంటే సుమారుగా రూ.5,200 కోట్లు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. దీనితోపాటే సహజంగానే నిర్మాణ ఖర్చు కూడా పెరుగుతుంది. మొత్తం మీద 140 మీటర్ల వెడల్పున ఓఆర్‌ఆర్‌ను విస్తరించాలంటే సుమారుగా రూ.21 వేల కోట్లు వ్యయాన్ని ఎన్‌హెచ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ సర్వే రిపోర్టులను క్రోడీకరించి, రెండు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పింపించాలని ఎన్‌హెచ్ అధికారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత ్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే క్షేత్ర స్థాయిలో పనులకు శ్రీకారం చుడతారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి