అమరావతి, 24 జూలై (హి.స.)
: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రాంతాల వారీగా ఉన్న నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్ల కాలపరిమితి ముగిసినందున స్థానిక విద్యార్థులతోనే సీట్లు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల హెల్త్ వర్సిటీలు సీట్లు కేటాయింపు ప్రక్రియను వేర్వేరుగా చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అడ్మిషన్లకు సంబంధించి ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలకు ఏపీ ప్రభుత్వం సవరణ చేసింది. స్థానిక, స్థానికేతర వ్యత్యాసంతో పాటు ఏయూ, ఎస్వీయూ ప్రాంతాల విద్యార్థులకు సీట్ల కేటాయింపులకు సంబంధించిన సవరణ జీవోను ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు జారీ చేశారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్రస్థాయి కాలేజీగా ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజీలోని సీట్లను 36:42:22 నిష్పత్తిలో ఓయూ, ఏయూ, ఎస్వీయూ ప్రాంతాల వారీగా కేటాయించేవారు. ఇప్పుడు ఓయూ పరిధిలోని విద్యార్థులకు కేటాయించే సీట్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఏయూ ప్రాంత విద్యార్థులకు 65.62 శాతం, ఎస్వీయూ పరిధిలో 34.38 శాతం చొప్పున సీట్లను కేటాయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి