వరంగల్, 25 జూలై (హి.స.)
వరంగల్ నగరంలోని నార్కోటెక్ పోలీస్ స్టేషన్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) సైదులు ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి రవాణా కేసు సంబంధిత వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన సమాచారం ప్రకారం.. వరంగల్ నర్సంపేట రోడ్డులో విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. అందులో ఒకరు మైనర్గా గుర్తించారు అధికారులు. అదుపులోకి తీసుకున్న నిందితులు ఒడిశా రాష్ట్రానికి చెందిన పండు అనే వ్యక్తి సుపారితో గంజాయి రవాణాకు పాల్పడినట్లు అంగీకరించారు. ఆ వ్యక్తి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి 51.081 కేజీల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 25,54,050గా అంచనా వేస్తున్నారు. గంజాయి రవాణాకు వినియోగించిన నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్, రెండు మొబైల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..