తెలంగాణ, ఆసిఫాబాద్. 26 జూలై (హి.స.)
ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే శనివారం కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనరల్ వార్డ్, ఎక్స్-రే గది, ప్రయోగశాల వంటి విభాగాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రతి రోజు పరీక్షలకు తీసుకునే నమూనాలు, వాటి నమోదు ప్రక్రియను రిజిస్టర్ల ద్వారా చూశారు. ల్యాబ్ టెక్నీషియన్ల పని తీరు, వాడే పరికరాల పనితీరుపై అధికారులను అడిగారు. తర్వాత రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులు పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రధాన ఆశ్రయం. ఇక్కడ చికిత్స నాణ్యంగా, సమయానికి అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. సరైన వసతులు, ఔషధాల లభ్యత, శుభ్రత అంశాల్లో ఎలాంటి అలసత్వం సహించేది లేదు అని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు