దిల్లీ:, 28 జూలై (హి.స.)ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తనపై త్రిసభ్య విచారణ కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశారు. అందులో ఆయన తన గుర్తింపును దాచిపెట్టారు. ‘XXX’గా తనను తాను అభివర్ణించుకున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
లైంగిక వేధింపులు, దాడికి గురైన మహిళా పిటిషనర్ల గుర్తింపును దాచేందుకు సుప్రీం కోర్టు (Supreme Court), హైకోర్టుల రికార్డుల్లో ఇలా వాడుతుంటారు. మైనర్లు, విఫల వివాహ బంధాల్లో పిల్లల కస్టడీకి సంబంధించిన అంశాల్లో కూడా గుర్తింపు వెల్లడికాకుండా ఇలా ఉపయోగిస్తుంటారు. అత్యాచార కేసుల్లో బాధితులు ప్రాణాలతో బయటపడిన వారి పేర్లను తీర్పుల్లో వెల్లడించవద్దని దిగువ న్యాయస్థానాలకు సుప్రీం పలుమార్లు సూచించిన సంగతి తెలిసిందే. ‘XXX వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ పేరిట జస్టిస్ వర్మ జులై 17న పిటిషన్ దాఖలు చేశారు. దీనిలో కేంద్రం తొలి ప్రతివాది కాగా.. సుప్రీంకోర్టు రెండో ప్రతివాదిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పిటిషన్‌లో ఆయన తన వివరాలపై గోప్యత పాటించడం వెనక గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ