హైదరాబాద్, 28 జూలై (హి.స.) ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత
కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2019లో మొదలైన ఈ కోతలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కూడా వందలాది కంపెనీలు.. లక్షలాది మంది ఉద్యోగులను తొలగించాయి. టీసీఎస్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
ఏఐ పుణ్యమాని ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్ను తగ్గించుకుంటున్నాయి. భారత్లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన మొత్తం ఉద్యోగులలో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనున్నది.
వ్యయ నియంత్రణలో భాగంగా సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 4 శాతానికి తక్కువ కాకుండా తొలగించాలని నిర్ణయించింది. దీంతో సుమారు 9 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ తొలగింపులు Xbox, గేమింగ్ విభాగాల్లో ఉండనున్నాయి.
కాగా, మైక్రోసాప్ట్ ఈ ఏడాది మే నెల మధ్యలో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
మరోవైపు, ఈ ఏడాది సుమారు 25 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ఇటీవల ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం.
టెక్ దిగ్గజం ఐబీఎమ్ కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. దాదాపు 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలిసింది.
ఇవేకాకుండా అమెజాన్, గూగుల్, మెటా వంటి ఇతర అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. అమెజాన్ తన బుక్స్, కిండిల్ విభాగాలతో పాటు పలు ఇతర టీమ్లలో వందమంది వరకూ ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2022 నుంచి ఇప్పటివరకు అమెజాన్ 27 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించింది.
ఈ ఏడాది ప్రారంభంలో మెటా 3 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. సెర్చింజన్ దిగ్గజం గూగుల్.. క్లౌడ్, పీపుల్ ఆపరేషన్స్, సేల్స్ తదితర విభాగాల్లో వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ కారణంగానే ఈ నిర్ణయమని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..