తెలంగాణ, ఆసిఫాబాద్. 29 జూలై (హి.స.)
పులుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యత సాధ్యం అవుతుందని ఆసిఫాబాద్ అటవీ డివిజన్ అధికారి దేవిదాస్ అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని తెలిపారు. పోడుసాగు వల్ల అటవీ విస్తీర్ణం తగ్గడంతో పులుల సంరక్షణ కష్టంగా మారిందన్నారు. దీనికి అడవులను నరకకుండా ఉండడమే పరిష్కారం అని అన్నారు.
జిల్లాలోని గిరిజనులకు పలుచోట్ల వెదురుతో వస్తువుల తయారీపై అవసరమైన శిక్షణ అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివాసీలకు అటవీశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా కార్యాలయం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ హెడ్ క్వార్టర్స్ మీదుగా ఎమ్మెల్యే ఇంటి నుండి సబ్ జైలు మీదుగా కార్యాలయం వరకు సాగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు