హైదరాబాద్, 29 జూలై (హి.స.)
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి డ్రామాలు చేస్తున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ రెండు పార్టీలకు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే అర్హతే లేదన్నారు. బీసీ అంశం లేవనెత్తిందే కాంగ్రెస్ పార్టీ అన్న ఆయన కచ్చితంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్ లో ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన జగ్గారెడ్డి కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇన్నేళ్లలో ఏ ఒక్కనాడైనా బీసీ కులగణన గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు.
పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందని నిలదీశారు. ముస్లీం, క్రిస్టియన్లు, హిందువులు అన్ని మతాల వారు భారతీయులేనని ఏదో పంచాయితీ పెట్టాలని బీజేపీ విమర్శలు చేస్తోందని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..