అమరావతి, 29 జూలై (హి.స.)జనసేన పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం, గౌరవం ఉంటుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాగబాబు కూటమి నాయకులతో, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. కూటమిలోని పార్టీ నేతలతో అపార్ధాలు తలెత్తితే సమన్వయ కమిటీ చూసుకొంటుంది. కార్యకర్తలు స్పందించవద్దని తెలిపారు. కూటమి పరిపాలన పట్ల ప్రజల్లో చాలా సంతృప్తి ఉందనే సమాచారం రాష్ట్ర నలుమూలల నుంచి అందుతోంది అన్నారు.
ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల ద్వారా రాష్ట్రానికి, కూటమి ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుందని నాగబాబు వెల్లడించారు. కొంచెం ముందు వెనక అయినా కష్టపడిన వారికి పదవులు తప్పనిసరిగా వస్తాయని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి పదవులు ఆశించకుండానే పదేళ్లకి పైగా ప్రజాక్షేత్రంలో పని చేసిన విధానాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు పదవులు ఎలా ఇస్తారు, ఎన్ని ఇస్తారు అనే అంశాలను పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్షిస్తున్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతీ ఒక్కరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి