తెలంగాణ, పెద్దపల్లి. 31 జూలై (హి.స.)
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓదెల
మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీని ఎమ్మెల్యే విజయ రమణారావు గురువారం అభినందించారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఓదెల మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి తాజాగా కొత్త పాలకవర్గాన్ని నియమించింది. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను తన నివాసంలో కలిశారు. నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే శాలువాలు కప్పి సన్మానం చేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాకు ప్రసిద్ధి చెందిన ఓదెల మల్లన్న ఆలయం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలుస్తోందని చెప్పారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. పాలకవర్గ సభ్యులు సేవా భావంతో పనిచేస్తూ ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు పాటుపడాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు