హైదరాబాద్, 31 జూలై (హి.స.) హాస్టల్ సందర్శించి పిల్లలతో
కలిసి అక్కడి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించిన మీ తీరు అభినందనీయమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందించారు. ఈ నెల 28న కలెక్టర్ ప్రావీణ్య హత్నూర కేజీబీవీ హాస్టల్ ను తనిఖీ చేశారు. హాస్టల్ మొత్తం సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. పిల్లలతో అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేసి అక్కడే పిల్లలతో కలిసి రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అక్కడి సిబ్బందిని ఆదేశించారు. పిల్లలతో కలిసి రాత్రి బస చేసిన కలెక్టర్ ప్రావీణ్య సీఎం నుంచి అభినందనలు పొందడం పై అధికార యంత్రాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్