అమరావతి, 4 జూలై (హి.స.)జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద వర్ధంతుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. వారి సేవలను, స్ఫూర్తిని స్మరించుకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ సందేశాలను పంచుకున్నారు.
భారత దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. పింగళి నిస్వార్థ సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. భారత జాతికి ఆయన అందించిన సేవలు ఎనలేనివని అన్నారు.
అలాగే, స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు. కేవలం కొద్దికాలంలోనే భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని గుర్తుచేశారు. యువతలో స్ఫూర్తి నింపే ఆయన బోధనలు ఎప్పటికీ ఆదర్శనీయమని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి