హైదరాబాద్, 4 జూలై (హి.స.)
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, నీరసంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో, ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచన మేరకు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు కేసీఆర్‌కు పలు పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యంపై నిన్న రాత్రి యశోద ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ప్రాథమిక పరీక్షల్లో రక్తంలో షుగర్ స్థాయులు అధికంగా, సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు తేలిందని బులెటిన్‌లో పేర్కొన్నారు. షుగర్, సోడియం సాధారణ స్థితికి వచ్చే వరకు కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.
కెసిఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్