తెలంగాణ, ఆదిలాబాద్. 5 జూలై (హి.స.)
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా నకిలీ స్టాంప్ పేపర్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి నకిలీ పట్టాలు , మున్సిపల్, రెవెన్యూ అధికారులు జారీ చేసే సర్టిఫికెట్లను తయారు చేస్తున్న రాకెట్ గుట్టును పోలీసులు ఛేదించారు.
ఆదిలాబాద్‌లో శనివారం నాడు ఎస్పీ అఖిల్ మహల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. నిందితులైన లాడ్వీ రాహుల్ కుమార్, ఆయన తండ్రి లాడ్వీ బద్రీనాథ్ ఇద్దరు కలసి ప్రభుత్వ శాఖలకు సంబంధించి అధికారుల సంతకాలతో కూడిన స్టాంపులు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసులకు సంబంధించి నకిలీ పత్రాలు, స్టాంపులు తయారు చేస్తున్నారు. లాడ్వీ రాహుల్ కుమార్ పరారీలో ఉన్నారని, ఆయన తండ్రి లాడ్వీ బద్రీనాథ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు