నెల్లూరు, 6 జూలై (హి.స.)నెల్లూరు(Nellore)లోని బారా షహీద్ దర్గా(Bara Shaheed Dargah) వద్ద నేడు జరుగుతున్న రొట్టెల పండుగ(Rottela Festival)కు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులు స్వర్ణాల చెరువులో పుణ్యస్నానం చేసి, విద్య, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఉద్యోగం వంటి తమ కోరికలు నెరవేరాలని రొట్టెలను మార్చుకుంటారు. కోరిక నెరవేరిన వారు రొట్టెను తిరిగి ఇతరులకు ఇవ్వడం ఆనవాయితీ. ఈ రొట్టెల మార్పిడి పండుగలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రొట్టెల మొక్కు అనంతరం బారా షహీద్‌లకు గలేఫ్‌లు, పూల చాదర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
కాగా నేటి నుంచి ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలవనుంది. హిందూ-ముస్లిం భక్తులు ఒకే వేదికపై కలిసి పాల్గొనే.. ఈ ఉత్సవం రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. దీనికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు
1751లో సౌదీ అరేబియా నుంచి ఇస్లాం మత ప్రచారం కోసం వచ్చిన 12 మంది వీరులు స్థానికులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందారని చరిత్ర చెబుతోంది. వారి సమాధుల వద్ద నిర్మితమైన ఈ దర్గా బారా షహీద్ (పన్నెండు మంది అమరవీరులు) దర్గాగా ప్రసిద్ధి చెందింది. అయితే ఒక రజకుని భార్యకు బారా షహీద్‌లు కలలో కనిపించి, ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యాన్ని తగ్గించే సూచన ఇవ్వడంతో, ఆమె రొట్టెలను పంచడం ద్వారా ఈ ఆచారం ప్రారంభమైందని ప్రచారంలో ఉంది. అప్పటినుంచి ఈ పండుగ 415 ఏళ్ల చరిత్ర కలిగి, భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి