విశాఖపట్నం, 5 జూలై (హి.స.)దేశవ్యాప్తంగా వందేభారత్ (Vandhebharath) ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ హైస్పీడ్ ట్రైన్లు వేగవంతమైన ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. సుమారు అన్ని రూట్లలోనూ ఈ రైళ్లకు టికెట్లు క్షణాల్లోనే బుక్ అవుతున్నాయి. ఈ వేగవంతమైన ట్రావెల్‌కు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో, రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యాలను మరింత మెరుగుపరచే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20707/20708) రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం తెలిపింది. ఇప్పటి వరకు 14 ఏసీ చెయిర్ కార్ కోచ్‌లు ఉన్న ఈ రైళ్లకు నాలుగు అదనంగా కలిపి వాటిని 18కి చేర్చారు. అయితే రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌ల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇక ఈ మార్పులు శనివారం (జూలై 6) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 5.05కు బయల్దేరి మధ్యాహ్నం 1.50కు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 2.30కి బయలుదేరి రాత్రి 11.00కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి