రాయచోటి, 5 జూలై (హి.స.)
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాద సంబంధాలపై దర్యాప్తు మరింత వేగం పట్టింది. ఇటీవల అరెస్టయిన అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీ ఇళ్లలో పోలీసులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అబూబకర్ ఇంట్లో ఓ పార్శిల్ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఢిల్లీకి పంపించేందుకు సిద్ధం చేసిందని దానిపై ఉన్న అడ్రస్ ను బట్టి తెలుస్తోంది. చిరునామాకు పంపించేందుకు సిద్ధంగా ఉంచినట్టు సమాచారం. ఇంట్లో నుంచే పేలుడు పదార్థాలు, పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, పాస్‌పోర్టులు, బ్యాంకు పాస్‌బుక్స్‌ను పోలీసులు జప్తు చేశారు. అంతర్జాతీయ సంబంధాల కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఈ కుటుంబాలకు ఇతర దేశాలతో సంబంధాలున్నాయా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల ఇళ్ల వద్ద బందోబస్తును పెంచారు.
ఇదే నేపథ్యంలో కొంతమంది అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఐబీ అధికారులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీని రాయచోటి ప్రాంతంలో అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నిందితుల భార్యలపై కూడా కేసులు నమోదు అయ్యాయి. అబూబకర్ భార్య షేక్ సైరాభాను, మహ్మద్ అలీ భార్య షేక్ షమీమ్‌లను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఇద్దరినీ కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ ఘటనతో జిల్లా పరిధిలో భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. రాయచోటి ప్రాంతం కేంద్రంగా ఉగ్ర ముఠాలు కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు అనుమానాల నేపథ్యంలో, మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి