తెలంగాణ, 6 జూలై (హి.స.)
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె
ఆదినారాయణ ప్రజలతో నేరుగా మమేకం అయ్యే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్టీసీలో ఆత్మీయ పలకరింపుల పేరిట ఆయన ఆదివారం దమ్మపేట మండలం ముష్టిబండ నుండి అశ్వారావుపేట వరకు ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రజలతో కలిసి ప్రయాణించారు.ఈ సందర్భంగా ఆయన బస్సులో ఉన్న ప్రయాణికులతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయో తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతు భరోసా, విద్య, ఆరోగ్య సదుపాయాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు.
గ్రామాల్లో ఎదురవుతున్న వ్యక్తిగత సమస్యలతోపాటు స్థానిక సమస్యలపై కూడా వివరంగా తెలుసుకున్నారు. ప్రజలు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా తమ సమస్యలను చెప్పేందుకు ఎమ్మెల్యే ప్రోత్సాహం కలిగించారు. ప్రజలకు సమస్యలు ఎదురవుతున్న చోట్ల తక్షణమే పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలతో నేరుగా మమేకం కావడం, వారి ఆవేదనలను నేరుగా వినడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేపడతామని తెలిపారు. సాధారణ ప్రయాణికుడిలా ఎమ్మెల్యే బస్సు ఎక్కడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు