అమరావతి, 6 జూలై (హి.స.)ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్లు మా మాస్టార్లు అని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ.. తమ పిల్లల్ని కూడా ఆ స్కూళ్లలోనే చదివించడం ఆదర్శనీయమని అభినందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ఈ మేస్టారులు.. మా'స్టార్స్'.. ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మీకు హ్యాట్సాఫ్. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని కోరే మీరు, మీ పిల్లల్ని కూడా అదే పాఠశాలల్లో చేర్పించడం ఆదర్శనీయం. ప్రభుత్వ విద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థల కంటే మెరుగైనవని గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన మీ పిల్లలు సాధించిన ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణలు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు జడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బొంతు మధుబాబు, పంగిడిగూడెం ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు బాబూ రాజేంద్రప్రసాద్, సోమరాజుచెరువు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరవాసరపు బాలకరుణాకరరావులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అని పోస్టులో పేర్కొన్నారు.
బాబూ జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ.. స్వాతంత్య్ర సమరయోధులు, దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. దళితులు, వెనుకబడిన తరగతులు, అణచివేతకు గురైన వర్గాల అభ్యున్నతి కోసం జగ్జీవన్ రామ్ గారు అలుపెరుగని పోరాటం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం. జగ్జీవన్ రామ్ గారి ఆశయ సాధన కోసం పునరంకితం కావడమే మనం అర్పించే ఘననివాళి. అని పేర్కొన్నారు.
తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఆషాడమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ ప్రారంభమవుతాయి. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లేరోజు. ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ మహావిష్ణుడు దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అని మరో పోస్ట్ పెట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి