,హైదరాబాదు, 9 జూలై (హి.స.)
రాజాధాని హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. 15 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదర్‌నగర్, కూకట్‌పల్లి, నడిగడ్డతండా, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది ఆదివారం ఉదయం కల్లు తాగారు. ఆ రోజు బాగున్నా.. సోమవారం ఉదయం నుంచి క్రమంగా బీr పీ పడిపోవడం, కొందరు స్పృహ కోల్పోవడం, తీవ్ర విరేచనాలు, వాంతులు, అచేతనంగా మారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వీరిని హైదర్‌గూడ రాందేవ్‌రావ్ ఆసుపత్రిలో చేర్చారు. బాధితులకు ఆదివారం నుంచి మూత్రం రావడం లేదు. ఈ ప్రభావం కిడ్నీలపై పడి.. క్రియాటినైన్ స్థాయులు పెరుగుతున్నాయి.
వారికి అత్యుత్తమ వైద్యంతోపాటు డయాలసిస్ చేసేందుకు నిమ్స్‌కు తరలించారు. అడ్డగుట్టకు చెందిన ఓదేలు పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చని.. వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఆబ్కారీ అధికారులు హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, శంషీగూడలోని మూడు కల్లు దుకాణాలను మంగళవారం సాయంత్రం హడావుడిగా సీజ్ చేసినట్లు తెలిసింది. అంతకుముందు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరెకపూడి గాంధీ, మేడ్చల్ జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ ఉమ రాందేవ్‌రావ్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ