ముంబయి: 9 జూలై (హి.స.)భారత రాజ్యాంగమే అత్యుత్తమమైందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భావించారని, న్యాయ వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం ఉండరాదని ఆయన కోరుకున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్నారు. మహారాష్ట్ర శాసనసభ తనను సన్మానించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శాంతి సమయాల్లోనే కాక యుద్ధవేళల్లోనూ దేశాన్ని సమైక్యంగా నిలిపే శక్తి భారత రాజ్యాంగానికి ఉందని అందుకే అది అత్యున్నతమైనదిగా అంబేడ్కర్ భావించారని సీజేఐ అన్నారు. దేశంలోని కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలకు అధికారాలిచ్చింది భారత రాజ్యాంగమేనని పేర్కొంటూ న్యాయ వ్యవస్థ పౌరుల హక్కుల్ని సంరక్షించాలని, హక్కుల ఉల్లంఘన జరగకుండా కాపలా కాయాలని అంబేడ్కర్ కోరుకున్నట్టు ఆయన తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ