దిల్లీ: 9 జూలై (హి.స.) దాదాపు 26 ఏళ్లుగా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్ (Monika Kapoor)ను అమెరికా (US)లో సీబీఐ కస్టడీకి అప్పగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎయిర్‌లైన్స్ విమానంలో బుధవారం రాత్రికి ఆమెను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువస్తున్నట్లు తెలిపారు. భారత్- అమెరికాల మధ్య ఉన్న ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం న్యూయార్క్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టు ఆమెను భారత్‌కు అప్పగించడానికి అనుమతి ఇచ్చింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మోనికా కపూర్ 1999 సంవత్సరంలో ఓ ఆభరణాల వ్యాపారం విషయంలో తన సోదరులతో కలిసి నకిలీ పత్రాలను తయారుచేసింది. వ్యాపారం చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం నుంచి లైసెన్స్‌లను పొందేందుకు ఈ పత్రాలను ఉపయోగించింది. అనంతరం వారు యూఎస్‌కు పారిపోయారు. 1999లో ఆమె చేసిన మోసానికి గాను భారత ప్రభుత్వానికి దాదాపు రూ.5 కోట్లకు పైగా నష్టం వాటిల్లడంతో 2004లో ఆమెపై కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ