హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. ఈ మేరకు రేపు ఆయన విజ్ఞాన్ భవన్లో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) లా, హ్యూమన్ రైట్స్ అండ్ RTI విభాగం-2025 ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న న్యాయ విభాగం కాంక్లేవ్లో పాల్గొనబోతున్నారు. 'రాజ్యాంగ సవాళ్లు-దృక్పథం, మార్గాలు' అనే థీమ్ సదస్సు కొనసాగనుంది. భారత రాజ్యాంగంలో నీతి, పరిణామ పాత్రపై న్యాయ నిపుణులు, విద్వాంసులు, విద్యార్థులు చర్చలో భాగస్వాములు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. సుమారు 1,200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్న ఈ కాంక్లేవ్కు నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్