తిరుమల, 1 ఆగస్టు (హి.స.)
తిరుమల భక్తుల(Tirumala)కు టీటీడీ(TTD) ముఖ్య గమనిక తెలిపింది. శ్రీవాణి టికెట్ల(Srivani Tickets)తో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇక నుంచి ఏ రోజుకారోజునే స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించింది.
ఈ విధానాన్ని ఈ రోజు శుక్రవారం నుంచే అమలు తీసుకొస్తోంది. ఇప్పటి వరకూ శ్రీవాణి టికెట్లతో మూడు రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. అయితే ఇక నుంచి అదే రోజు శ్రీవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
శుక్రవారం నుంచి ఆగస్టు 15 వరకూ ప్రయోగాత్మకంగా తిరుమలలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆఫ్ లైన్ ద్వారా శ్రీవాణి టికెట్లతో వచ్చిన రోజునే శ్రీవారి దర్శనం కల్పిస్తారు.
తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి ముందుగా వచ్చిన భక్తులకు 800 టికెట్లు, రేణి గుంట ఎయిర్ పోర్టులో ఉదయం 7 గంటల నుంచి కోటా ఉన్నంత వరకూ 200 టికెట్లు పంపిణీ చేస్తారు. ఆన్ లైన్ టికెట్లతో వచ్చే భక్తులకు సాయంత్రం 4.30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు. అక్టోబర్ 31 వరకు ఆన్ లైన్ ద్వారా శ్రీవాణి దర్శనం టికెట్లు పొందిన భక్తులకు యధావిథిగా ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. నవంబర్ 1 నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 ద్వారా సాయంత్రం 4.30 గంటలకు ఆన్ లైన్ , ఆఫ్ లైన్ భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి