దిల్లీ: 1 ఆగస్టు (హి.స.) భారత్ (India) మిత్ర దేశమంటూనే.. 25శాతం సుంకంతో పాటు పెనాల్టీలు కూడా విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). ఈ టారిఫ్‌ల మోతకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే ఊహాగానాలను అధికార వర్గాలు కొట్టిపడేశాయి. ఇరుదేశాల ప్రయోజనాలకు అనుగుణంగా జరిగే చర్చల్లో నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది.
ట్రంప్ సుంకాలపై భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోదని అధికార వర్గాలు స్పష్టంచేశాయి. మౌనమే సరైన సమాధానమని.. ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరిస్తామని తెలిపాయి. ట్రంప్ టారిఫ్‌లు భారత ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే, అధికార వర్గాలు దీన్ని కొట్టిపారేశాయి. తొలిగా అణు పరీక్షలు చేసినప్పుడు కూడా మనపై ఇలాంటి ఆంక్షలే విధించారని.. ఆ సమయంలో మనది చాలా చిన్న ఆర్థికవ్యవస్థ అని అన్నారు. ప్రస్తుతం భారత ఆర్థికవ్యవస్థ చాలా అభివృద్ధి చెందిందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చర్చలు కొనసాగుతున్నాయని.. ఇరుదేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ