హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఆదివారం ఇబ్రహీంపట్నంలో సిపిఎం పార్టీ రంగారెడ్డి కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం నాయకులు కే.అరుణ్ కుమార్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రం నుంచి ఎన్నికైన బిజెపి ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రంలో కులగణన పూర్తి అయింది. దాని ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్