తెలంగాణ, ఖమ్మం. 10 ఆగస్టు (హి.స.)
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని వంగవీడులో రూ. 630.30 కోట్ల వ్యయంతో జవహార్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాన అతిథిగా పాల్గొనగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని సాగర్ కాలువల నుంచి నీరు పొందాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. మధిర నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని ఏరు దాటుతున్నా, ఆ నీరు వృథా అవుతోంది. ఉద్యమాల సమయంలో ఇది చేయలేకపోయాం, కానీ పదేళ్ల TRS పాలనలో ఒక్క చుక్క నీటినీ సద్వినియోగం చేయలేదన్నారు.
ఉమ్మడి రాష్ట్ర కాలంలో ప్రారంభమైన ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, ముఖ్యంగా జలిముడి ప్రాజెక్ట్ పట్ల BRS ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని ఆయన విమర్శించారు. దయలేని BRS పాలన తర్వాత, ఇంద్రమ్మ రాజ్యం రాగానే ఈ పథకానికి మోక్షం లభించింది. మూడో జోన్లో 35 వేల ఎకరాలకు నీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదం చేస్తుంది అని భట్టి విక్రమార్క తెలిపారు.
అంతేకాకుండా.. సాగర్ మూడో జోన్ మొత్తం రెండో జోన్లో కలిసేలా రూపకల్పన చేస్తున్నాం. ఖమ్మం జిల్లా మొత్తం సాగర్ నీటిపైనే ఆధారపడి ఉంది. మనం కేవలం 1 TMC కృష్ణా నీటిని వాడుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్ వారు 11 TMCల నీటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరిగితే శ్రీశైలం ఖాళీ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు