హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)
ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి తమతో టచ్లో ఉన్నారని అన్నారు. ఛాంబర్తో చర్చలు జరపాలని సూచించారని చెప్పారు. నిర్మాత టీజి విశ్వప్రసాద్ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటామని ప్రకటించారు. కార్మికులకు పీపుల్స్ మీడియా వారు రూ.90 లక్షలు ఇవ్వాలని.. ఆ డబ్బులన్నీ తక్షణమే ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులు ఇచ్చేవరకు టీజీ విశ్వప్రసాద్కు సంబంధించిన సినిమాల షూటింగ్స్ను బ్యాన్ చేస్తున్నామని సంచలన ప్రకటన చేశారు. ఈ అంశాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తాం.. ఆయన మా పక్షానే ఉన్నారని అన్నారు. రేపు స్వయంగా వెళ్లి కోమటిరెడ్డి ఎదుట మా గోడు వెళ్లబోసుకుంటామని తెలిపారు.
ఇదిలా ఉంటే.. శనివారం నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు నిర్వహించిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఇవాల్టి నుంచి ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. రోజు వారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు ఒకేరకమైన వేతనాలు పెంచాల్సిందేనని ఫెడరేషన్ నాయకులు పట్టుబట్టారు. దీనికి నిర్మాతలు అంగీకరించడం లేదు. దీంతో తరచూ చర్చలు విఫలం అవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..