అమరావతి, 10 ఆగస్టు (హి.స.)
ఏపీకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. తిరుపతి, కడప, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. జనాలకు కీలక సూచనలు చేస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారబోతుంది. ఈ నెల 13వ తేదీ నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు తెలంగాణతోపాటు ఏపీలో కూడా ప్రభావం చూపించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్టు 10) తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు, అంటే 11వ తేదీన, ఈ ప్రభావం 19 జిల్లాల్లో కనిపించనుంది. అంటే దాదాపు రాష్ట్రం మొత్తం వర్షం ప్రభావం కనిపించనుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ