అమరావతి, 10 ఆగస్టు (హి.స.)
రామవరప్పాడు, మల్లమ్మ సెంటర్(నరసరావుపేట), : అక్కతో రాఖీ కట్టించుకునేందుకు ఆనందంగా ద్విచక్రవాహనంపై బయల్దేరిన యువకుడిని లారీ రూపంలో మృతువు కబళించింది. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాలు.. పల్నాడు జిల్లా నరసరావుపేట ఇస్లాంపేటకు చెందిన షేక్ మహ్మద్ హారిఫ్ మస్తాన్ (26) ఏలూరులోని ఎస్‌బీఐ శాఖలో క్రెడిట్ విభాగంలో పనిచేస్తున్నాడు. రాఖీ పూర్ణిమ సందర్భంగా తన అక్క (బాబాయి కుమార్తె)తో రాఖీ కట్టించుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బాబాయి ఇంట¨కి బయలుదేరాడు. నిడమానూరు వంతెన వద్ద లారీని దాటబోతుండగా ద్విచక్రవాహనం హ్యాండిల్ లారీకి తాకి అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ క్రమంలో మస్తాన్ నడుముపై నుండి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతికందొచ్చిన ఒక్కగానొక్క కుమారుడికి వివాహం చేసి మురిసిపోదామని కలలుగన్న తల్లిదండ్రులు బోరున విలిపించారు. ఇతని మృతితో ఇస్లాంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి దరియావలి ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ