దిల్లీ:,10 ఆగస్టు (హి.స.)
ఆపరేషన్ సిందూర్ (Military operation)లో భాగంగా భారతీయ వాయుసేన పాకిస్థాన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని నేలకూల్చిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది (Army chief Upendra Dwivedi) ఈ విషయంపై ఐఐటీ మద్రాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో మన సైన్యం దాయాది దేశంతో చెస్ ఆడిందని అన్నారు. శత్రువు తదుపరి కదలికలు ఏమిటో కూడా ఆ సమయంలో తమకు తెలియదని.. ఈ పరిస్థితిని గ్రేజోన్ అంటారని అన్నారు. అయినప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ.. ఆ దేశానికి చెక్ పెట్టామని పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్‌ను ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని ద్వివేది (Upendra Dwivedi) తెలిపారు. మన పౌరులను బలి తీసుకున్న ఉగ్రవాదులను అంతం చేయాలని త్రివిధ దళాలు కోరినప్పుడు.. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడించారు. దీంతో తాము ఉగ్ర స్థావరాలను సమర్థవంతంగా ధ్వంసం చేశామన్నారు. ఆపరేషన్ అనంతరం పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ మునీర్ (Asim Munir)ను ఆ దేశ ‘ఫీల్డ్ మార్షల్’గా నియమించడాన్ని ద్వివేది ఎద్దేవా చేశారు. వారు యుద్ధంలో గెలవకపోయినా ఆర్మీ అధికారికి అత్యున్నత పదవి ఇవ్వగానే అక్కడి ప్రజలు తాము గెలిచామనే భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. కానీ అది విజయమా లేదా అపజయమా అనేది వారి మనస్సాక్షికే తెలుసన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ