రాహుల్‌కు నోటీసులా? వాళ్లెవరు?: ఈసీపై డీకే శివకుమార్ ఫైర్
బెంగళూరు, 11 ఆగస్టు (హి.స.) లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చే అధికారం ఎన్నికల సంఘానికి లేదని ఆయన సోమవార
రాహుల్‌కు నోటీసులా? వాళ్లెవరు?: ఈసీపై డీకే శివకుమార్ ఫైర్


బెంగళూరు, 11 ఆగస్టు (హి.స.)

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చే అధికారం ఎన్నికల సంఘానికి లేదని ఆయన సోమవారం స్పష్టం చేశారు. అవసరమైతే తామే ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.

బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి నోటీసులు ఇవ్వడానికి వాళ్లెవరు? వాళ్లను నోటీసులు ఇవ్వమనండి. నోటీసులు ఇచ్చే అధికారం మాకుంది, మేమే వాళ్లకు నోటీసులు పంపిస్తాం అని డీకే శివకుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము ఎన్నికల్లో గెలిచామని, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే హక్కు మాత్రమే ఈసీకి ఉందని, తమకు నోటీసులు జారీ చేసే హక్కు లేదని ఆయన అన్నారు. ఈసీ నోటీసులపై చట్టపరంగా స్పందిస్తామని తెలిపారు.

అసలేం జరిగింది?

ఎన్నికల్లో మోసం జరిగిందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని కోరుతూ కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వి. అన్బుకుమార్ ఆదివారం ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 7న ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో షకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటు వేశారని రాహుల్ ఆరోపించారు. పోలింగ్ అధికారి రికార్డుల ప్రకారమే తాను ఈ విషయం చెబుతున్నానని, అందుకు సంబంధించిన పత్రాన్ని కూడా ప్రదర్శించారు.

అయితే, రాహుల్ చూపించిన పత్రం అధికారికమైనది కాదని సీఈఓ తన నోటీసులో పేర్కొన్నారు. తాము జరిపిన ప్రాథమిక విచారణలో షకున్ రాణి ఒక్కసారే ఓటు వేసినట్లు తేలిందని వివరించారు. ఈ నేపథ్యంలో, షకున్ రాణి గానీ, మరెవరైనా గానీ రెండుసార్లు ఓటు వేశారని నిర్ధారణకు రావడానికి మీ వద్ద ఉన్న ఆధారాలను, సంబంధిత పత్రాలను సమర్పించాలని రాహుల్ గాంధీని ఆ నోటీసులో కోరారు. దీని ఆధారంగా తాము పూర్తిస్థాయి విచారణ చేపడతామని తెలిపారు.

ఈ నెల‌ 8న జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, గత 10 ఏళ్ల ఎలక్ట్రానిక్ ఓటర్ల జాబితాను, వీడియో రికార్డింగ్‌లను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే, ఈసీఐ నేరాన్ని దాచిపెడుతున్నట్లేనని ఆయన ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande