శ్రీశైలం, 11 ఆగస్టు (హి.స.)
శ్రీశైలం-హైదరాబాద్ ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండడంతో డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీకెండ్స్‌లో శ్రీశైలం వెళ్లే రహదారులన్నీ భక్తులు, పర్యాటకులతో నిండిపోతుంటాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంటుంది. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తే సమయంలో అయితే ఆ సుందర దృశ్యాలను చూసేందుకు యాత్రికులు ఘాట్ రోడ్డులో వాహనాలు నిలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది. దాదాపు 10 కిలోమీటర్లకుపైగా వాహనాలు బారులుదీరేవి. లింగాల గట్టు నుంచి బ్రహ్మగిరి వరకు వాహనాలు ముందుకు కదిలేవి కాదు. ఘాట్ రోడ్డు కావడంతో వాహనాల రద్దీ ఎక్కువైతే ప్రమాదాలు కూడా జరుగుతుండేవి. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది. దీంతో శ్రీశైలంలో ట్రాఫిక్ నియంత్రణకు అధికారుల చర్యలు చేపట్టారు.
డ్రోన్ల కెమెరాతో నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్రీశైలం సీఐ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ట్రాఫిక్‌తో భక్తులు ఇబ్బంది పడకుండా డ్రోన్ కెమెరాలతో శ్రీశైలం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ప్రత్యేక మొబైల్ పార్టీ ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ చర్యలు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ఉపయోగపడతాయని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి