ఇక సీబీఎస్సీ విద్యార్ధులకు ఓపెన్‌ బుక్‌ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
ఢిల్లీ, 11 ఆగస్టు (హి.స.) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఓపెన్-బుక్ అసెస్‌మెంట్స్ (OBAs) ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పాఠశాలల్లో ఈ ఫార్మాట్ సాధ్యాసాధ్య
ఇక సీబీఎస్సీ విద్యార్ధులకు ఓపెన్‌ బుక్‌ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?


ఢిల్లీ, 11 ఆగస్టు (హి.స.)

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఓపెన్-బుక్ అసెస్‌మెంట్స్ (OBAs) ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పాఠశాలల్లో ఈ ఫార్మాట్ సాధ్యాసాధ్యాలపై పైలట్ అధ్యయనం తర్వాత బోర్డు పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ ద్వారా విద్యార్ధులు బట్టీ పట్టే విధానంకి స్వస్తి పలికేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ పాఠశాల విద్య పాఠ్య ప్రణాళిక చట్రం (NCFSE) 2023, జాతీయ విద్యా విధానం (NEP) 2020 లకు సైతం ఈ విధానం అనుగుణంగా ఉంటుందని బోర్డు పేర్కొంది.

CBSE ఓపెన్-బుక్ అసెస్‌మెంట్ ఫార్మాట్ లాంగ్వేజ్‌, మ్యాథమెటిక్స్‌, సైన్స్, సోషల్ స్టడీస్‌ వంటి ప్రధాన సబ్జెక్టులను కవర్ చేస్తుంది. విద్యార్థులు మూల్యాంకనాల సమయంలో పాఠ్యపుస్తకాలు, తరగతి గమనికలు, ఆమోదించబడిన వనరులను వినియోగించవచ్చు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను CBSE అందిస్తుంది. అయితే ఈ ఫార్మాట్‌ను స్వీకరించాలా? వద్దా? అనే పూర్తిగా పాఠశాలల అభిష్టంపై ఆధారపడి ఉంటుంది. ఈ విధమైన మూల్యాంకనాలు ప్రతి విద్యా సంవత్సరంలో నిర్వహించే మూడు పెన్-పేపర్ పరీక్షలలో భాగంగా ఉంటాయి.

డిసెంబర్ 2023లో ఆమోదించబడిన పైలట్ ప్రాజెక్ట్ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చింది. 9 నుంచి 12 తరగతులలో ఓపెన్-బుక్ పరీక్షలను అమలు చేసేందుకు అనుమతి తెలిపింది. ఈ విధానం ద్వారా విద్యార్థుల పనితీరు 12 శాతం నుంచి 47 శాతం వరకు పెరుగుతుందని అభిప్రాయపడింది. ఇది వనరులను సమర్థవంతంగా ఉపయోగించడంలో, ఇంటర్ డిసిప్లినరీ భావనలను అర్థం చేసుకోవడంలో సవాళ్లను అధిగమించేలా చేస్తుంది. దీని ట్రయల్‌లో పాల్గొన్న ఉపాధ్యాయులు కూడా OBA పరీక్షల గురించి ఆశాజనకంగా స్పందించారు. ఇవి విమర్శనాత్మక ఆలోచనను పెంచే సామర్థ్యాన్ని అందిస్తాయని అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande