కడప, 11 ఆగస్టు (హి.స.)ఏపీలో ఉప ఎన్నికల జోరు నడుస్తోంది. కడప జిల్లా పులివెందుల(Pulivendula), ఒంటిమిట్ట(Ontimitta) జడ్పీటీసీ ఉప ఎన్నికలు(Zptc Elections) రేపు 12న జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్రం చూపంతా ఇపుడు ఒక్కసారిగా కడపపై పడింది. కాగా ఈ ఉపఎన్నికల్లో రెండుచోట్లా మొత్తం 11 మంది బరిలో ఉండగా.. ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యే ఉంది. పులివెందులలో టీడీపీ తరపున మారెడ్డి లలితారెడ్డి పోటీ చేస్తుండగా, వైసీపీ తరపున హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఒంటిమిట్టలో టీడీపీ తరపున ముద్దు కృష్ణారెడ్డి పోటీలో ఉండగా, వైసీపీ తరపున సుబ్బారెడ్డి పోటీ పడుతున్నారు.
ఈ ఎన్నికకు ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం అయినట్టు కలెక్టర్ శ్రీధర్ తెలియజేశారు. రేపు 12న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్ల వద్దకు ఓటు హక్కు ఉన్న వాళ్లు మాత్రమే వెళ్లాలని, ఇతరులు వెళ్లకూడదని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి