అమరావతి, 12 ఆగస్టు (హి.స.): మధ్య బంగాళాఖాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. రేపటికి అల్ప పీడనంగా బలపడే అవకాశం ఉంది. ఆరు రోజులపాటు ఏపీకి విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది.. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.. ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లా రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది..
మరోవైపు అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో గత 5-6 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వానలతో దాదాపుగా అన్ని జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదలకు చెరువులు, జలాశయాలు నిండిపోయాయి. మరోవైపు రహదారులపై వరద చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రయాణికులు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర వాసులకు ఓ సూచన చేశారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా ప్లాన్ చూసుకోవాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి సాయంత్రం షిఫ్ట్ ఉన్నవారు ఇంటి నుంచే పని చేసేలా ప్లాన్ చేసుకోవాలని ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ