హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.) రాఖీ పండుగ రోజు తెలంగాణ ఆర్టీసీ స్పెషల్
బస్సుల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేసింది. ఈ అదనపు చార్జీలను ఉటంకిస్తూ 'నిధి నేషన్' పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. ఆ పోస్ట్ను ట్యాగ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. పండుగల వేళ మహిళల సీట్లు దొరకక, పురుషులు డబుల్ చార్జీల కారణంగా సీఎం తిడుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.
రేవంత్ రెడ్డి ఏదైనా పండుగ రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల 'రేర్' దీవెనలను నేరుగా పొందాలని కోరారు. పండుగొస్తే చాలు బెంబేలెత్తేలా చేస్తున్న రేవంతానికి సన్మానం చేయడానికి ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మహిళలకు ఉచితం అంటూనే పురుషులకు ఛార్జీలు డబుల్ చేసి వాళ్లని ట్రబుల్ చేస్తున్న రేవంతాన్ని చూడటానికి జనాలు తహతహలాడుతున్నారని తెలిపారు.
'పండగ రోజు కూడా ప్రజల సొమ్ములు కొల్లగొట్టాలంటే ప్రత్యేకమైన టాలెంట్ కావాలి..! రాఖీ రోజు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం అంటే మామూలు తెలివి కాదు..!' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పండుగల వేళ చార్జీలు పెంచడంపై సీఎం ఓ సలహా కూడా ఇచ్చారు. 'పోని ఒక పని చెయ్యండి. ఈ పెంచుడు కార్యక్రమాన్ని 'ఏడో గారంటీ' అని ప్రచారం చెయ్యండి. వీలయితే 'పండగ గిఫ్ట్' అని కార్డులు వేసి పంచిపెట్టండి..! జనం బాగా గుర్తుపెట్టుకుంటారు..!' అని కేటీఆర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్