దిల్లీ:12 ఆగస్టు (హి.స.)సింధూ జలాల ఒప్పందం (Indus River) నిలిపివేత విషయంలో పాకిస్థాన్ (Pakistan) తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఓర్వలేక అణు బెదిరింపులకు పాల్పడుతోంది. తాజాగా ఆ దేశ విదేశాంగశాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto) కూడా తీవ్రమైన హెచ్చరికలు చేశారు. దీనిపై సినీనటుడు, భాజపా నేత మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే భారత్ సహనం నశిస్తుందని అన్నారు. అప్పుడు బ్రహ్మోస్ క్షిపణులు ఒకదాని తర్వాత ఒకటి ఆ దేశంపైకి దూసుకెళ్తాయని హెచ్చరించారు.
భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో తమ దేశానికి పెద్ద నష్టం జరిగిందని భుట్టో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పాక్‌కు చాలా నష్టం కలిగించాయి. మన ప్రజలంతా ఐక్యంగా ఉండాలి. వారి దురాక్రమణలకు వ్యతిరేకంగా కలిసి నిలబడాలి’ అని అన్నారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగితే.. పాక్ యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరు నదులు తిరిగి పొందేందుకు తమ పౌరులంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ