పులివెందుల, 12 ఆగస్టు (హి.స.)
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో 1,400 మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు.
మరోవైపు, పులివెందుల మండలం కణంపల్లెలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు కారులో వెళుతున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం టీడీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ కు బయల్దేరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి